కాసేపట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన

minister-ktr

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ పక్క రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అగ్ర సంస్థలతో చర్చలు జరుపుతూనే, మరోపక్క ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేలుస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు..ఇలా రోజంతా బిజీ బిజీ గా గడుపుతూ ప్రజల మనిషి అనిపించుకుంటూ వస్తున్నారు. ఇక ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నారు.

జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 11.30 గంటలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్‌ మండలంలో యాదవ సంఘ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు వారివారి నియోజకవర్గాల్లో ప్రజల్లో మమేకం కావాలని, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలుకు వివరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.