రేపు ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే..

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్‌ సర్వే కొనసాగనుంది.

ఇక గురువారం జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై చర్చించారు. ముందస్తు వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలపై సమీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌ కమ్‌ రాక్ ఫిల్‌ డ్యాం నిర్మాణంలో ఏర్పడ్డ గ్యాప్‌1, గ్యాప్‌ 2లు పూడ్చే పనులపై సమావేశంలో చర్చించారు. రెండు గ్యాప్‌లను పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల పరీక్షలు అవసరమని తెలిపారు. వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. వరద వల్ల దిగువ కాఫర్‌ డ్యాం పనులకు అంతరాయం ఏర్పడిందని.. గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితే గాని పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు వివరించారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు.

ఎగువన తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతోంది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని సీఎం జగన్‌ సూచించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్‌.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.