కాంగోలో ఘోర బోటు ప్రమాదం..145 మృతి

రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందారు. మరో 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ సరుకులు, పశువులతో రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోకు వెళుతుండగా బసంకుసు పట్టణ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బోటులో ప్రయాణికులు, వస్తువులు, జంతువులతో నిండిపోవడంతో బోటు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ పడవ ప్రమాదాలు జరగడం కామన్అయిపోయింది. ఇక్కడ రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడవల్లో నిత్యం ప్రయాణిస్తుంటారు. వలసలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. గతేడాది అక్టోబర్‌లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.