కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు అద్భుతం – కేటీఆర్

కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు అంటూ కేటీఆర్ ప్రశంసించారు. కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ 2023 లో పాల్గొని ప్రసంగించారు.
అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి అవార్డుతో ఏఎస్సీఈ సత్కరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కరువును తరిమేసిన విధానాన్ని, నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరిస్తుంటే వివిధ దేశాల నేతలు అబ్బురపడ్డారు. కాళేశ్వరం ఒక కలికితురాయి అని పొగడ్తలతో ముంచెత్తారు. దాని ఘనతలను మంత్రి కేటీఆర్ చెప్తుంటే చప్పట్లతో హోరెత్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తవ్విన మట్టితో 101 గాజా పిరమిడ్ల ను నింపవచ్చని, ఈ ప్రాజెక్టులో వినియోగించిన ఉక్కుతో 66 ఈఫిల్ టవర్ల నిర్మాణం చేపట్టవచ్చని, కాంక్రీట్‌తో 53 బూర్జ్ ఖలీఫా టవర్ల నిర్మాణం చేపట్టవచ్చని కేటీఆర్ తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 13 జిల్లాల్లో 500 కిమీ మేర విస్తరించి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా 20 కేంద్రాల్లో 22 పంప్‌హౌస్‌లు, 1800 కిమీ మేర కాలువలు విస్తరించి ఉన్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. 139మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఉన్నాయని కేటీఆర్ తెలియజేశారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వృద్ధిని సాధిస్తోందని తెలియజేశారు.