సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ కాదు సబ్ కా సత్తేనాశ్ అయ్యింది – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్..కేంద్రం ఫై విరుచుకపడ్డారు. మోడీ పాలనలో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ కాదు సబ్ కా సత్తేనాశ్ అయ్యిందంటూ ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న పెట్రో ధ‌ర‌ల‌పై నిర‌స‌న తెలియజేస్తూ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్టు పెరిగినా తగ్గినా దేశంలో రేటు పెంచడమే తమ పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు.

దోపిడీ ల‌క్ష్యంగా పీఎం పెట్రో ప‌న్ను యోజ‌న ప‌థ‌కం తీసుకొచ్చార‌ని ప్ర‌ధానిపై కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్రో ధ‌ర‌ల పెంపుతో దేశ ప్ర‌జ‌ల‌పై రూ.26.51 ల‌క్ష‌ల కోట్ల మేర భారం ప‌డింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. దోపిడీ కూడా దేశం కోసం, ధ‌ర్మం కోస‌మేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణమన్నారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తోంది. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుందన్నారు. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం’’ అని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.