భారత్ లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌

కరోనా మహమ్మారి ప్రజలను వదిలిపెట్టడం లేదు. రకరకాల వేరియంట్లలో ప్రజలపై విరుచుకపడుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

భారత్‌లో ఒమిక్రాన్‌లో రెండు కొత్త వేరియంట్‌లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ (XE) వేరియంట్‌ కేసు నమోదైనట్లు బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్‌ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కొత్త రకం వేరియంట్‌ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు.

బ్రిటన్ లో తొలిసారిగా ఓమిక్రాన్ XE వేరియంట్ కేసు నమోదైంది. జనవరి 19న బ్రిటన్ లో తొలికేసు నమోదైంది. ప్రస్తుతం బ్రిటన్ దేశంలో ఈ రకం కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఓమిక్రాన్ కన్నా 10 రెట్ల వేగంగా ఓమిక్రాన్ XE వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్‌ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.

కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 1086 కోవిడ్‌ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,97,567కు చేరింది. మరో పక్క చైనా లో కరోనా కేసులు తీవ్రతరం అవుతుండడం తో అక్కడి ప్రజలు భయాందోళన లో ఉన్నారు.