పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కేటీఆర్ వార్నింగ్..?

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తుండడం తో అందరికంటే ముందే బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం అయ్యింది. అయితే గతంలో మాదిరిగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం..రెండు , మూడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం పార్టీ లో ఆగ్రహపు జ్వాలలు రేపుతోంది. మొన్నటి వరకు తమకే టికెట్ వస్తుందని ఎదురుచూసిన వారికీ టికెట్ రాకపోయేసరికి..వారంతా పార్టీ మారేందుకు చూస్తున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోయేసరికి వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

ఇదిలా ఉంటె జనగామలో సిట్టింగ్ అయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఉండడం తో ఆయనకు టికెట్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టారు కేసీఆర్. ఇక ఇప్పడూ ఆ టికెట్ ఫై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి లు ఆశిస్తున్నారు. ఎవరికీ వారే తమ బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ విషయాన్నే నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈ క్రమంలోనే అమెరికా నుండి వచ్చిన కేటీఆర్ కు ఈ విషయం తెలిసింది. దీంతో దీనిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇంతలోనే.. జనగామ మండలం నిడిగొండలో ఓ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా హాజరయ్యాయి. కాగా.. హైదరాబాద్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బయలుదేరగా.. ఈ విషయం తెలిసిన కేటీఆర్ వెంటనే ఫోన్ అందుకుని కాల్ చేశారు. ఏం పల్లా అన్నా.. గిట్లే ఉంటదా.. గిదేనా పద్ధతి.. ఇలా చేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. అంటూ తన అసహనాన్ని మొత్తం వెల్లగక్కినట్టు తెలుస్తోంది. ఆ సమావేశానికి మాత్రం హాజరుకావొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశానికి వెళ్లకుండా వెనక్కి వచ్చినట్లు సమాచారం.