కరోనా ప్రభావం : మద్రాస్ హైకోర్టు మూసివేత
ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ

Chennai: కరోనా ఎఫెక్ట్ తో మద్రాస్ హైకోర్టు మూతపడింది. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకడంతో మొత్తం కోర్టును మూసేశారు.
ఇకపై ఇంటి నుంచే కేసుల విచారణ జరుగుతుందనీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలను జరిపించేందుకు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో కోర్టును మూసివేసిన తరువాత ఈ నెల 1 నుంచే తిరిగి కోర్టులో విచారణలు మొదలయ్యాయి. మద్రాసుతో పాటు మధురై హైకోర్టు బెంచ్ లోనూ విచారణలు జరుగుతూ వచ్చాయి.
అయితే ముగ్గురు జడ్జీలకు కరోనా సోకడంతో మిగతా వారి నమూనాలనూ వైద్యాధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.
ఆ రిపోర్టులు రావాల్సివుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో కలిసి సమావేశమై, హైకోర్టుకు తాళం వేయాలని నిర్ణయించారు.
ఆ వెంటనే న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ రావద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
అత్యవసర కేసుల నిమిత్తం ఓ ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేసి, జడ్జీలు ఇంటి నుంచే విచారణలు చేపట్టాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/