ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం..

అవినీతి నిరోధక శాఖ వలకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌.. ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు.తనిఖీలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆయన బ్యాంకు లాకర్స్‌ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. తన పదవిని, ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది.

గుర్తించిన ఆస్తులు ఇవే..

రూ. 40 లక్షల నగదు, ఐదుకోట్ల విలువైన బంగారం
భారీ గా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం
70ఎకరాల భూమి, ఇండ్లు
60 ఖరీదైన చేతి గడియారాలు..
100 మొబైల్ ఫోన్లు, నాలుగు కార్లు
10 ల్యాప్ టాప్స్

వీటితో పాటు ఇంట్లోనే ఆయన క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉంచుకోవడం గమనార్హం. అలాగే.. ఆయన బ్యాంకు లాకర్లు తెరవడంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.