తన పీఏపై వస్తున్న ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థి సంఘాల తో పాటు ప్రతిపక్ష పార్టీ లు సైతం ఈ వ్యవహారం ఫై ఆందోళన చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 15 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ పేపర్ లీక్ వ్యవహారం తో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి కి సంబంధం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. నా పీఏ వెంట పడుతున్నారేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగిత్యాల జిల్లా మొత్తంలో కేవలం ఒక్కరే క్వాలిఫై అయ్యారని .. తన పీఏ తిరుపతి స్వగ్రామం పోతారంలో పరీక్ష రాసింది ముగ్గురైతే అందులో ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మల్యాలలో మొత్తం 415 మంది పరీక్ష రాయగా అందులో 35 మంది అర్హత సాధించారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది పరీక్షలు రాస్తే ఒక్కరికి కూడా 100 మార్కులు దాటలేదని స్పష్టం చేశారు. మరి నేను లీక్ చేసింది ఎక్కడ? అని కేటీఆర్ అడిగారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? అంటూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.