ఏపీలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భాంగా తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఏపీలో ను కేటీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. విజయవాడ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఏపీ సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ అభిమానుల సమక్షంలో ‌కేక్ కట్ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలని ఆకాంక్షించారు. కేటీఆర్ కి ఏపీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ని కోరుతున్నామని తెలిపారు.

తెలంగాణ తరహాలో ఏపీలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పీహెచ్ డీ చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు లో కూడా ఏది చదివినా… తమ వంతు సాయం అందిస్తామని తమ అధ్యక్షులు చెప్పారని పేర్కొన్నారు.

మరోపక్క సినీ ప్రముఖులు సైతం కేటీఆర్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, మ్యాచో స్టార్ గోపీచంద్, నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, కోన వెంకట్ తదితరులు కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘మై డియర్ బ్రదర్ తారక్.. మీరు ఒక డైనమిక్ లీడర్, మేమంతా ఎంతగానో ప్రేమించే, మెచ్చుకునే స్నేహితుడు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కలలు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. మీ ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలని, మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్. ఆవిష్కరణలు, అభివృద్ధి పట్ల మీకు ఉన్న అభిరుచిని మేము ఎల్లప్పుడూ కొనియాడతాం. ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న మీకు ఈరోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.