సస్పెన్షన్ నిర్ణయంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను వైస్సార్సీపీ సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ఫై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.

కొన్నాళ్లుగా అధికార పార్టీ ఫై ఆనం, కోటంరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎలాగూ తమకు సపోర్ట్ చేయబోరని పార్టీ భావించింది. కానీ.. కొత్తగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గురువారం సాయంత్రమే ఆరోపణలు వచ్చాయి. కానీ.. ఉండవల్లి, మేకపాటి వాటిని ఖండించారు. తాము క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. కానీ.. పార్టీ సంతృప్తి చెందలేదు. దీంతో సస్పెన్షన్ వేటు వేసింది.