క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ : నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు ఎమ్మెల్యేల ఫై వేటు వేసింది వైస్సార్సీపీ అధిష్టానం. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇక సస్పెండ్ అయిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని సజ్జల వ్యాఖ్యానించారు.

కొన్నాళ్లుగా ఆనం, కోటంరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎలాగూ తమకు సపోర్ట్ చేయబోరని పార్టీ భావించింది. కానీ.. కొత్తగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు గురువారం సాయంత్రమే ఆరోపణలు వచ్చాయి. కానీ.. ఉండవల్లి, మేకపాటి వాటిని ఖండించారు. తాము క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. కానీ.. పార్టీ సంతృప్తి చెందలేదు. దీంతో సస్పెన్షన్ వేటు వేసింది.

దీనిపై సజ్జల మాట్లాడుతూ..చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు ఇచ్చి కొన్నారని ఆరోపించారు. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమేనని అభిప్రాయపడ్డారు. రోగ కారకాన్ని తక్షణమే గుర్తించి ఇలాంటి వాటిని తొలగించుకోవాలని సజ్జల వ్యాఖ్యానించారు. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరమనే సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు.

కేవలం అసంతృప్తి వల్లే ఎవరూ బయటికి వెళ్లరని, ప్రలోభపెట్టడం వల్లే తమ వాళ్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ నేతలు తమపై అభిమానంతో వచ్చారని, ఆ పార్టీలో అసంతృప్తి వల్లే వారు బయటికి వచ్చారని వివరించారు.