వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్..టీడీపీ నుండి పోటీ చేస్తా

గత రెండు రోజులుగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్న తరుణంలో కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్టుగా ఉన్న ఓ ఆడియో లీక్ అయ్యి..ఇప్పుడు వైరల్ గా మారింది.

తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని… ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను తాను బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని ఆయన అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం షేక్ అవుతుందని… కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసమే తాను పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తన సన్నిహితులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వినుకొండ పర్యటనకు వచ్చిన జగన్‌ దృష్టికి కోటంరెడ్డి వ్యవహారాన్ని మంత్రి కాకాణి తీసుకెళ్లారు. అనంతరం కాకాణి స్పందిస్తూ.. కోటంరెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాను లాంటిదని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కానీ.. మంత్రి అలా చెప్పిన గంట్లలోనే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో బయటకు వచ్చింది. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. దాన్ని రికార్డ్ చేసినట్టు స్పష్టం అవుతోంది.