తనకి ప్రాణహాని ఉన్న టైములో సెక్యూరిటీ తగ్గిస్తారా అంటూ ఆనం రామనారాయణరెడ్డి ఫైర్

తన సెక్యూరిటీ తగ్గించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని.. స్మగ్లర్లు, వారికి సహకరించే వారు ఇక్కడ ఉన్నారని, అలాంటి చోట తిరిగే నాకు రక్షణ ఉండదా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకి ప్రాణహాని తలపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆనం రామనారాయణరెడ్డి. తనకి నక్సల్స్ నుంచి త్రెట్ ఉన్నా సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు. తనకి నక్సల్స్ నుంచి థ్రెడ్ ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ డీజీపీకి చెప్పిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తీసేస్తారా? అని ప్రశ్నించారు.

అలాగే తన ఫోన్ ను రెండేళ్లు గా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు ఆనం. అలాగే తన గన్ మెన్, పిఏ ఫోన్ లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాప్ చేయడం వల్ల వాట్స్ యాప్, ఫేస్ టైమ్ యాప్ లో మాట్లాడాల్సి వస్తుందన్నారు. తన బిడ్డలతో కూడా ఇలానే మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాప్ చేసేదే మా వాళ్ళు, ఇంక నేనెవ్వరికి ఫిర్యాదు చేయాలన్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని అన్నారు. సీబీఐ కేసుల్లో తాను హైద్రాబాద్ చుట్టూ తిరగడం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతుందని తాను వ్యాఖ్యలు చేసిన రోజు నుండి తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

ఇక గత కొంతకాలంగా వైస్సార్సీపీ అధిష్టానం ఫై ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై వైస్సార్సీపీ నాయకత్వం ఆనం రామనారాయణ రెడ్డిపై చర్యలకు తీసుకుంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతల నుండి ఆనంని అధిష్టానం తప్పించడం జరిగింది.