తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ ను విడుదల చేసిన గవర్నర్ తమిళిసై

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం గవర్నర్ తమిళిసై తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజున మధ్యాహ్నం 12:10 గంటలకు ఇరుసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో పలు మార్పులు చేయాలని గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చెప్పారు. అయితే తమిళి సై సూచనలకు అనుగుణంగానే బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉన్న వాస్తవాలనే ప్రసంగంలో చూపిస్తామని తెలిపారు.

వాస్తవానికి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కానీ, బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వం నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి చర్చలు జరపడంతో బడ్జెట్ సమావేశాలపై గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది.