ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి కొండా సురేఖ. శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పటు చేసారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సమక్షం జరిగిన ఈ సమావేశంలో సురేఖ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని, ఇప్పటికైనా కాంగ్రెస్ లో అందరు కలిసి పని చేయాలని సూచించారు.

అంతేకాకుండా పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వ్యక్తిగత అంశాలు మాట్లాడవద్దని కోరారు. ఏదైనా ఉంటే ఇన్చార్జిని కలవాలని సూచించారు.

గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అవుతున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.