రచయిత అనంత శ్రీరామ్‌..మరో వివాదంలో చిక్కుకున్నాడు

ప్రముఖ సినీ రచయిత అనంత శ్రీరామ్‌..వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలపై భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారాయన. స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఆయన పాపులర్ లిరిక్ రైటర్‌గా మారారు. అయితే ఈ మధ్య అనంత శ్రీరామ్ తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు.

పాలకొల్లులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన తన ప్రసంగంలో భట్రాజు పొగడ్తలు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భట్రాజు కులస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్టేజీపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఫిర్యాదుకు జత చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిందని.. అయినా తమ కులంపై ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. గతంలోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా తరుచు శ్రీరామ్ వివాదాల్లో నిలుస్తూ వస్తున్నారు.