కండ్లుండీ చూడ‌లేని వారికి ఈ అభివృద్ధి క‌నిపించ‌దు అంటూ నడ్డా ఫై హరీష్ రావు ఫైర్

హన్మకొండ సభలో నడ్డా చేసిన వ్యాఖ్యల ఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ నిర్మించలేదని నడ్డా చేసిన కామెంట్స్ ఫై హరీష్ రావు స్పందించారు.

చారిత్ర‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హెల్త్ సిటీగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక‌ల్పించారు. 24 అంత‌స్తుల్లో 2000 ప‌డ‌క‌ల‌తో సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణానికి ప్ర‌భుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసింది. వెనువెంట‌నే టెండ‌ర్ల ప్ర‌క్రియ చేప‌ట్టి, శర వేగంగా ప‌నులు ప్రారంభించింది. మూడు నెల‌ల్లోనే 15 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. కండ్లుండీ చూడ‌లేని వారికి ఈ అభివృద్ధి క‌నిపించ‌దు. నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే వారికి ఈ హాస్పిట‌ల్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అర్థం కావని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

వరంగల్ లో నిర్మాణంలో ఉన్నది ఆస్ప‌త్రి మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మించబడుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ. ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందటంతో పాటు వైద్య విద్య , పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.