రేపు ఖమ్మం లో భారీ సభ.. మరోసారి టీ కాంగ్రెస్ లో బయటపడ్డ విభేదాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నిత్యం నేతల మధ్య విభేదాలు కొనసాగుతుంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందు నుండి ఎవరికీ వారు యమునా తీరు అనేలా నడుస్తుంటారు. రేవంత్ రెడ్డి కి పీసీసీ పదవి దక్కిన దగ్గరి నుండి మరి ఎక్కువైంది. ఈ మధ్య కాస్త తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఖమ్మం సభ నేపథ్యంలో మరోసారి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనగర్జన పేరుతో రేపు ఖమ్మంలో ( జూలై 2న) భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి మొత్తం ఖమ్మం పైనే ఉంది. తెలంగాణలో అధికారానికి దగ్గరవుతున్నామనే నమ్మకం కాంగ్రెస్‌లో క్రమంగా పెరుగుతోంది. ఈ విశ్వాసమే ఇప్పుడు ఖమ్మం సభకు ఐక్యంగా నేతలు కదులుతున్నారు. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు 30 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో నేతలంతా సభ పనుల్లో బిజీ గా ఉన్నారు. తెలంగాణ కీలక నేతలు ఈ సభను సక్సెస్ చేయడానికి తమవంతుగా వివిధ పనులలో నిమగ్నం అయి ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేయించిన పోస్టర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కలకలాన్ని రేపుతోంది. తెలంగాణ జన గర్జన సభ అనే టైటిల్ తో వేసిన ఈ పోస్టర్ లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి , రాహుల్ గాంధీ , భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జూపల్లి కృష్ణరావు లు మాత్రమే ఉన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోటో మాత్రం ఈ పోస్టర్ లో లేదు. దీనిని బట్టి రేవంత్ రెడ్డికి మరియు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి మధ్యన ఇంకా విభేదాలు అలానే ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి రేపు సభలో ఎలా ఉంటుందో..? ఇద్దరు మాట్లాడుకుంటారా..లేదా..? అనేది చూడాలి.