మహబూబాబాద్ పర్యటన లో మంత్రి కేటీఆర్ – ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య అసలు ఏంజరిగిదంటే..

మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. కాగా కేటీఆర్ పర్యటన లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కేటీఆర్ తోసి వేయడం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో దీనిపై రకరకాలుగా మాట్లాడుకోవడం , ప్రచారం కావడం జరిగింది. గతంలో పలు వివాదాల్లో శంకర్ నాయక్ చిక్కుకోవడం తో ఆ ఉద్దేశ్యం తోనే కేటీఆర్ తోసేసినట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు జరిగింది వేరని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పుకునే ప్రయత్నం చేసారు.

పర్యటన లో భాగంగా మంత్రి కేటీఆర్ ఉదయాన ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి మహబూబాబాద్ కు చేరుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మైదానంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి మార్గంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. దానిని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ విద్యార్థులతో కేటీఆర్ మీద పూలు చల్లించే ఏర్పాటు చేశారు. స్వతహాగా పూలు అంటే ఎలర్జీ ఉన్న కేటీఆర్ అవి వద్దని వారించారు. ఈ విషయం తెలియని శంకర్ నాయక్.. బలవంతం చేయడం, మంత్రి చేతిలో చేయి వేయడంతో ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఒక్కసారిగా అసహనంతో తన చేతిలో నుంచి ఎమ్మెల్యే చెయ్యిని తోసి వేశారు. ఇది మీడియా లో వైరల్ గా మారింది. పలు మీడియా లలో , సోషల్ మీడియా లో మరో విధంగా ప్రచారం కావడం తో..శంకర్ నాయక్ అసలు జరిగిన విషయాన్ని తెలిపారు.

పూలు అంటే కేటీఆర్ కు ఎలర్జీ ఉన్న నేపథ్యంలోనే తన చేయిని తోసివేశారని, అంతేతప్ప తనంటే వ్యతిరేకత కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ గా మారడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.