రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే బిజెపి 9 రాష్ట్రాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ సైతం ఏడు రాష్ట్రాల నుండి తమ అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారి లను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేష్ కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకాలకు అవకాశం కల్పించింది.

అలాగే వీరితో పాటు రాజీవ్ శుక్లా( చత్తీస్గడ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజిత్ రంజన్( బీహార్), అజయ్ మకెన్( హర్యానా), ఇమ్రాన్ ప్రతాప్ గర్హి( మహారాష్ట్ర) లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేష్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి పార్టీ 8 రాష్ట్రాల నుంచి 16 మందికి రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూ‌ష్​ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలోనే వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.