ఫిబ్రవరి నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంః మంత్రి కోమటిరెడ్డి

ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చుతామని పునరుద్ఘాటన

komatireddy-venkat-reddy-says-free-power-scheme-from-february

హైదరాబాద్‌ః వచ్చే ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు.. వాటి అమలుపై కమిటీ చర్చించింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వంద రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు హామీలు నెరవేర్చామని, మిగతా వాటిని గడువులోగా అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు. హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఈ కారణంగానే హామీల అమలు జాప్యం అవుతోందని వెల్లడించారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు అన్ని హామీలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటును కూడా గెలుచుకోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ పాలనలోని అన్ని అక్రమాలపై విచారణ ఉంటుందన్నారు.