పీసీసీ ఇచ్చిన వెంటనే పాదయాత్ర చేపడతా

ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా.. కోమటిరెడ్డి

komatireddy venkatareddy
komatireddy venkatareddy

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీపడుతున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. ఇప్పుడైనా తనకు ఆ పదవి వస్తుందనే ధీమాలో ఆయన ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తనకు సీఎం, మంత్రి పదవులు అవసరం లేదని… పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే చాలని అన్నారు. పీసీసీ పగ్గాలను తనకిస్తే… రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

పీసీసీ ఇవ్వాలని గతంలో కూడా అడిగానని… కానీ తనకు అవకాశం ఇవ్వలేదని కోమటిరెడ్డి అన్నారు. ఈ సారైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ని అడిగానని చెప్పారు. పీసీసీ పదవిని ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపడతానని… ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హైదరాబాదులో ఉంటానని అన్నారు. ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ప్రజలతో కలిసి ప్రగతి భవన్ పునాదులను కదిలిస్తానని చెప్పారు. తనపై భూకబ్జా కేసులు కానీ, ఇతర కేసులు కానీ లేవని… అలాంటప్పుడు పీసీసీ తనకు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన చరిత్ర తనదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చివరి స్టేజ్ లో ఉందని… తనకు పీసీసీ ఇస్తే పునర్వైభవాన్ని తీసుకొస్తానని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/