మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగాలు

మచిలిపట్నం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో వున్న ఎస్ఐ పై చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించాంటూ కొల్లు రవీంద్ర నిన్న మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు.

కల్పించుకున్న పోలీసులు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రవీంద్ర మండిపడ్డారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తోపులాట కూడా జరిగింది. గెలుపు కోసం పేర్ని నాని విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు కొల్లు నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/