సంజయ్ రౌత్ నివాసంలో రూ.11.5 లక్షల నగదు స్వాధీనం
ప్రత్యేక కవర్‌లో రూ.10 లక్షలు

ముంబయిః శివసేన నేత సంజయ్ రౌత్‌ను పాత్రాచల్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆదివారం రౌత్ ఇంట్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ.11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు ప్రత్యేక కవర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో సోదాల తర్వాత ముంబయిలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయన్ను ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అయితే, రౌత్ విచారణకు సహకరించడంలేదని ఆదివారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఈడీ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది.
పాత్రాచాల్ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ మరికొంతమందికి సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసు విషయమై రౌత్‌ను జులై 1న దాదాపు 10 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు. ఆ నేపథ్యంలో ఆదివారం ఈడీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. అనంతరం ఆయన్ను కార్యాలయానికి తరలించేటప్పుడు కొన్ని సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనేమో తల్లి పాదాలకు నమస్కరించి, ఆమెను ఆలింగనం చేసుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/