కుమార్తెతో కలిసి గూఢచర్య ఉపగ్రహాన్ని పరిశీలించిన కిమ్‌

స్పై శాటిలైట్ ను రూపొందించిన ఉత్తర కొరియా

Kim Jong Un Examines Soon-to-Be-Launched Spy Satellite …

సియోల్‌ః త్వరలో రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమ గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ పరిశీలించారు. ఓ ఏరోస్పేస్ కేంద్రంలో ఉన్న ఆ స్పై శాటిలైట్ ను కిమ్ జాంగ్ ఉన్ సందర్శించారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు కిమ్ ఆమోదం తెలిపారని, ఉత్తర కొరియా నిఘా సామర్థ్యాన్ని ఇనుమడింపజేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారని వివరించింది.

కాగా, దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించడానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాలు చేపడుతోందని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఉత్తర కొరియా మరోసారి ఐక్యరాజ్యసమితి తీర్మానాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు.