కాంగ్రెస్ జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్…

ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురి చేరిక నేపథ్యంలో ఖమ్మలో సుమారు వంద ఎకరాల్లో నిర్వహించిన జనగర్జన ..లక్షలాదిమందితో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది.

అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన జనాలు మాత్రం సభకు రాకుండా ఉండలేకపోయారు. RTC బస్సులను , ప్రైవేటు బస్సులు, స్కూల్‌, కళాశాలల బస్సులు అద్దెకు ఇవ్వకుండా చేసిన , రవాణాశాఖ అధికారులు ఎక్కడిక్కడే చెక్‌పోస్టులు, బారికేడ్లు పెట్టి వాహనాలను తనిఖీలు చేసినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు , పొంగులేటి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ జనసంద్రాన్ని చూసి ఒకిత్త రాహుల్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఖమ్మం జనసంద్రాన్ని చూస్తే రేవంత్ చెప్పినట్లు ఖమ్మంలో పదికి పది కాంగ్రెస్ గెలవడం ఖాయంగా కనిపించింది.

సభకు ముఖ్య అతిధిగా హాజరైన రాహుల్..తెలంగాణ ఫై వరాల జల్లు కురిపించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లుగానే.. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ బీఆర్‌ఎస్‌నూ ఓడించబోతున్నామని ప్రకటించారు. తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించిన రాహుల్‌.. అన్ని విషయాల్లోనూ స్పష్టతనిచ్చారు. సభలో అందరితో కలివిడిగా వ్యవహరించిన రాహుల్‌గాంధీ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో చేరిన పొంగులేటికి, పార్టీ సీనియర్లకు తగు గౌరవం ఇస్తూ అందరినీ సమన్వయం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ గతంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌, హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించగా, ఖమ్మంలో రాహుల్‌గాంధీ చేయూత పథకాన్ని ప్రకటించారు. చేయూత పథకం కింద పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామని వెల్లడించారు. ఇటీవలే వికలాంగుల పెన్షన్‌ను రూ.4,116కు పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. తాజాగా రాహుల్‌ చేసిన ప్రకటనతో మిగిలిన స్కీమ్‌లకు సంబంధించీ సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది. రాహల్‌తోపాటు ఇతర నేతలందరి ప్రసంగం కాంగ్రెస్‌ కార్యర్తలను ఉత్తేజపరిచేలా సాగింది.