సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కేజ్రీవాల్

Arvind Kejriwal

న్యూఢిల్లీః మద్యం పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తాజాగా ఉపసంహరించుకున్నారు . అంతకు ముందు కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.

అయితే, ఈ విచారణ ట్రయల్‌ కోర్టులో రిమాండ్‌ ప్రొసీడింగ్స్‌తో క్లాష్‌ అవుతుందని కేజ్రీవాల్ తరఫు లాయర్లు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీని కారణంగా పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్‌ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చింది.