అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు

Ayodhya Ram Mandir

న్యూఢిల్లీః అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ మృగశిర నక్షత్రంలో అభిజీత్‌ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే, కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు సాకేత్‌ నిలయంలో సంఘ్‌ పరివార్‌ సమావేశం జరిగింది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ఇందులో మొదటి దశ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభం కాగా.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్నది. కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనున్నారు.

ఇందుకు స్టీరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్‌ స్థాయిలో పది మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అయోధ్య రామమందిరం ఉద్యమానికి చెందిన కరసేవకులను సైతం ఈ బృందాల్లో చేర్చుకోనున్నారు. ఇక జనవరి ఒకటో తేదీ నుంచి రెండో దశ ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పది కోట్ల కుటుంబాలకు అక్షతలు, రామ్‌లల్లా చిత్రపటం, కరపత్రం అందజేయనున్నారు. ప్రతిష్ఠాపన రోజున దీపోత్సవం జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. జనవరి 22న మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించే యోచనలో ఉన్నారు. రిపబ్లిక్‌ డే నుంచి ఫిబ్రవరి 22 వరకు కొనసాగనున్నది.