జైలు నుండి విడుదలైన కేజ్రీవాల్‌..నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం

Kejriwal released from jail..Media conference today afternoon

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ లభించడంతో గత రాత్రి తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉమ్మడిగా పోరాడాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షించుకునేందుకు అందరం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

‘‘త్వరలో బయటకు వస్తానని నేను చెప్పాను. ఇప్పుడు వచ్చాను. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు ఆశీర్వదించారు. బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు. బెయిల్ రావడంతోనే నేను మీ అందరితో కలిసి ఉన్నాను’’ అని అన్నారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో అందరికీ ధన్యవాదాలు తెలుపుతానని, మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు శుక్రవారం ఊరట లభించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు పలు షరతులతో ఈ బెయిల్ ఇచ్చింది. జూన్ 2న ఆయన తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది.

కాగా జైలు వద్ద అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన భార్య సునీతతో పాటు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు స్వాగతం పలికారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా కేజ్రీవాల్‌కు ఆహ్వానం పలికారు. కేజ్రీవాల్ నివాసం వద్ద కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.