రంగనాథస్వామిని దర్శించుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు లో బిజీ బిజీ గా ఉన్నారు. శ్రీరంగం వెళ్లిన ఆయన.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంగనాథస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్, ఆయేన సతీమణి శోభ, కేటీఆర్, ఆయన బార్య నీలిమ, వారి పిల్లలు.. పూజల్లో పాల్గొన్నారు. సీఎం కుటుంబానికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగానికి వెళ్లి రంగనాథస్వామి ఆలయాన్ని చేరుకున్నారు.

వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఆహ్వానం ప‌లికారు. ఆల‌యంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అంత‌కుముందు తిరుచ్చి క‌లెక్టర్ శివ‌రాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆయనతో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో తమిళనాడు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

మంగ‌ళ‌వారం కేసీఆర్.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో స‌మావేశం కానున్నారు. రేపు తిరుత్త‌ణిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశమ‌వుతారు. ఈ భేటీ స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇవాళ రాత్రికి త‌మిళ‌నాడులోని ఐటీసీ హోట‌ల్‌లో కేసీఆర్ బ‌స చేయ‌నున్నారు.