వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

ఏపీలోని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో అపార నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బాధిత ప్రాంతాల్లో తక్షణ వరద సాయం, పంట నష్టం అంచనా, ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

వరద బాధితులకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం, కూరగాయలు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు సహాయంగా ఇవ్వాలన్నారు. మంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా సహాయం అందాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు.

కొందరు రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని.. జగన్‌ విమర్శించారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని.. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని ఆయన గుర్తుచేశారు. వరదల కారణంగా ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉందని.. ఆ బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వరదలు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలని ఆదేశించారు. మీకు ఏం కావాలన్నా.. అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నిధుల సమస్య లేనే లేదు. మీరు ప్రోయాక్టివ్‌గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్‌ చేస్తే చాలు అన్నారు.