మీరు కార్మికుల వైపా? కాంగ్రెస్‌ వైపా?..వామపక్షాలకు కేసీఆర్ సవాల్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో శుక్రవారం జరిగిన రోడ్ షో లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వామపక్షాలకు సవాల్ విసిరారు. ‘ఇప్పుడు సింగరేణిని ముంచటానికి బీజేపీ, కాంగ్రెస్‌ ఏకం అవుతున్నాయి. అధిక ధరల ఆస్ట్రేలియా బొగ్గు తెచ్చి.. తెలంగాణకు అంటగట్టి, సింగరేణిని సర్వనాశనం చేయాలనుకుంటున్న మోదీ దోస్త్‌ అదానీకి రేవంత్‌రెడ్డి రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నరు. సింగరేణిని నిండా ముంచాలని చూస్తున్నరు. దీనిపై వామపక్ష నేతలు తమ వైఖరి చెప్పాలి’ అంటూ సవాల్ విసిరారు.

ఒకప్పుడు సింగరేణిలో కార్మికుల కుటుంబాలకు ఆదరువుగా ఉన్న డిపెండెంట్‌ ఉద్యోగాలను పోగొట్టిందే కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం. ఆ ఉద్యోగాలను మేం పునరుద్ధరించాం. 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినం. సిమ్స్‌ అనే పేరు మీద సింగరేణి మెడికల్‌ కాలేజీ పెట్టుకున్నం. ఆ కాలేజీలో 5 శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేట్టు చేసినం. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతే కేంద్రానికి వాటాను అమ్మేసిందే కాంగ్రెస్‌. దాన్ని నష్టాల్లో ముంచిందే కాంగ్రెస్‌. అటువంటిది సింగరేణిని లాభాల్లోకి తెచ్చి కార్మికులకు పంచినం. కాంగ్రెస్‌ దాన్ని ముంచితే, బీఆర్‌ఎస్‌ కాపాడింది. మరి వామపక్ష నాయకులు ఇప్పుడేం చెప్తరు? సింగరేణికి శాపం లాంటి అదానీతో ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నవ్‌? అని కాంగ్రెస్‌ను వాళ్లు నిలదీయాలి’ అని కేసీఆర్‌ అన్నారు.