గద్దర్ భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన సీఎం కేసీఆర్

అల్వాల్ లో గద్దర్ పార్థివ‌దేహానికి సీఎం కేసీఆర్ నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరికాసేపట్లో అల్వాల్ మహాబోధి స్కూలులో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నివాళుల‌ర్పించారు.

గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌కు అంతిమయాత్రగా తరలించారు. దాదాపు 6 గంటలపాటు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు , విప్లవకారులు , ఉద్యమ కారులు , అభిమానులు పాల్గొన్నారు. గద్దర్ ఆదివారం మరణించడంతో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనాదర్ధం సోమవారం మధ్యాహ్నం వరకు ఎల్బీస్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. గద్దర్ ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. గద్దర్ అంత్యక్రియలు బౌద్ధ మత పద్ధతుల్లో జరగనున్నాయి.