వర్షాకాలం పూర్తయితే జగన్ పని అయిపోయినట్లే – చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో పర్యటిస్తూ..ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ లు తీసుకుంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ లు విసురుతున్నారు. సోమవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. వర్షాకాలం పూర్తయితే జగన్ పని అయిపోయినట్లే అని అన్నారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని వివరించారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

కాఫర్ డ్యామ్ గ్యాప్ లు పూర్తిచేయనందువల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు నీరు వెళ్లిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులు చేయలేదని అన్నారు. అసలు, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న రెండేళ్లకు గానీ ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని స్పష్టం చేశారు.