తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ వెంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరారవు, సంతోష్‌ కుమార్‌, మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఉన్నారు.

కాసేపట్లో బాడీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రతినిధుల సమావేశానికి ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే సిబ్బంది లోపలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక తీర్మానాలపై చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో నేతలు పలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది.