హోం మంత్రి అమిత్ షాపై పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

బిజెపి నేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంగళవారం బాగాల్‌‌కోట్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్‌కు పొరపాటున ఓటు వేసినా, రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంటుంది. వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతం పెచ్చరిల్లుతాయి. అల్లర్లు చెలరేగి యావత్ రాష్ట్రం అవస్థల పాలవుతుంది’’ అని షా మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమిత్ షా..ప్రచారంలో రెచ్చగొట్టే ప్రకటనలు, శత్రుత్వం, ద్వేషం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపిస్తూ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతపరమైన అల్లర్లు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. అయితే ఈ మాటలను అమిత్ షా ఇలా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. పోలీసులకు పిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా, పరమేశ్వర్‌, డీకే శివకుమార్‌ లు ఉన్నారు.