గోదావరికి శాంతిపూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు నిర్వహించారు. ఉదయం హన్మకొండ నుండి రోడ్డు మార్గాన భద్రాచలం కు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేయాలనీ అనుకున్నప్పటికీ , వాతావరణం అనుకూలించకపోవడం తో రోడ్డు మార్గాన బయలుదేరారు. హన్మకొండ నుండి ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. రోడ్డు మార్గాన గోదావరి ఉదృతిని పరిశీలిస్తూ వచ్చారు. భద్రాచలంకు చేరుకోగానే ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి శాంతి పూజ నిర్వ‌హించారు. వంతెన పైనుంచి గోదావ‌రి ప‌రిస‌రాల‌ను సీఎం ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మ‌రికాసేప‌ట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.