22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

KCR Bus Yatra from April 22 to May 10

హైదరాబాద్‌ః బీఆర్‌ఆఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టానున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బస్సు యాత్ర షెడ్యూల్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నట్లు సమాచారం. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

కాగా, పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వరుస బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇటీవల మెదక్ జిల్లా నుస్తులాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ సీఎం రేవంత్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం నాటి కేసీఆర్ ను ప్రజలు మళ్లీ చూడబోతున్నారని అన్నారు.ఈ నేపథ్యంలోనే ప్రచారంలో జోష్ పెంచేందుకు, అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బస్సు యాత్రలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

మరోవైపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్‌మ్యాప్‌ను, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని నిన్న జ‌రిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ సూచించారు. రోడ్‌షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని కోరారు.