కవిత ఈడీ సమన్ల కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఈ నెల 16న విచారిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం

Kavitha ED summons case.. Hearing adjourned in Supreme Court

హైదరాబాద్‌ః ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలుకాగా.. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.