బలపరీక్ష.. భారీ భద్రత మధ్య అసెంబ్లీకి చేరుకున్న హేమంత్‌ సోరెన్‌

Hemant Soren Reaches Jharkhand Assembly, Trust Vote Begins

రాంచీః జార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపయీ సొరేన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్‌ సోరెన్‌ పాల్గొననున్నారు. శాసనసభలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు పీఎంఎల్‌ఎ కోర్టు నుంచి సోరెన్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బలపరీక్షలో ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఈ ఉదయం సోరెన్‌ను అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. మరికాసేపట్లో బలపరీక్ష జరగనుంది.

మరోవైపు బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సైతం రాంచీ చేరుకున్నారు. బిజెపి ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్‌కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌) పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బిజెపి, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.