రేపు కవితను అరెస్ట్ చేస్తారా..? అందుకే సీఎం కేసీఆర్ ఆలా అన్నాడా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు రేపు ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయబోతున్నారా..? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 8నే విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే తనకు ఈ నెల 9, 10వ తేదీల్లో వేరే షెడ్యూల్ ఉండడం వల్ల 11వ తేదీన విచారణకు వస్తానని కవిత ఈడీకి బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు (మార్చి 11)న ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కాగా విచారణ అనంతరం కవిత ను అధికారులు అరెస్ట్ చేయబోతారని రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలాగా సీఎం కేసీఆర్..ఈరోజు జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో కవిత అరెస్ట్ గురించి మాట్లాడారు. ”రేపు కవితను అరెస్ట్ చేయెుచ్చ. మెున్న గంగుల, నిన్న రవిచంద్ర, నేడు కవిత వరకు వచ్చారు. ఎంత మంచిగా పనిచేసినా గానీ మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ప్రజల కోసం కడుపుకట్టుకుని పనిచేస్తున్నాం. కవితను అరెస్ట్ చేస్తే.. చేసుకోని, మేం ఎవరికీ భయపడం” అని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి భయపడేదే లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పిలుపునిచ్చారు.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు నాయకులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 10 గంటల తర్వాత కవిత ఈడీ ఆఫీస్ కు హాజరుకానున్నారు. ఆమెతో పాటుగా రామచంద్ర పిళ్లైను కలిసి విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయంత్రం పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే ఢిల్లీకి పయనమయ్యారు. ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు, ముఖ్యనేతలు కూడా ఢిల్లీ బయల్దేరారు. కేటీఆర్ అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్ తో భేటీ కానున్నారు. రేపు, ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.