చ‌ర్చ‌ల ద్వారా ఓ పరిష్కారం క‌నుగొన‌కుంటే గాజా గ‌తే ప‌డుతుందిః ఫ‌రూక్ అబ్ధుల్లా

Kashmir Will Meet Same Fate As Gaza If No India-Pak Talks: Farooq Abdullah After Poonch Attack

న్యూఢిల్లీ : భార‌త్‌, పాకిస్తాన్ చ‌ర్చ‌ల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోని ప‌క్షంలో జ‌మ్ము క‌శ్మీర్‌లో గాజా త‌ర‌హా ప‌రిస్ధితి త‌లెత్త‌క త‌ప్ప‌ద‌ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చీఫ్‌, జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్ధుల్లా పేర్కొన్నారు. గ‌త వారం పూంచ్‌లో జ‌రిగిన ఉగ్ర దాడిలో ముగ్గురు పౌరులు స‌హా న‌లుగురు భార‌త సైనికులు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ఫ‌రూక్ అబ్ధుల్లా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

చ‌ర్చ‌ల ద్వారా మ‌నం ఓ పరిష్కారం క‌నుగొన‌కుంటే గాజా, పాల‌స్తీనా గ‌తే ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. హ‌మాస్ దాడి నేప‌ధ్యంలో గాజా, పాల‌స్తీనాల‌పై ఇజ్రాయెల్ బాంబుల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నం పొరుగుదేశంతో స్నేహంగా మెలిగితే ఇరు దేశాలకూ మేలు క‌లుగుతుంద‌ని గ‌తంలో మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌పేయి చెప్పిన విష‌యం ఆయ‌న గుర్తుచేశారు.

యుద్ధం ఇప్పుడు స‌రైన ఎంపిక కాద‌ని, సంప్ర‌దింపుల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. పాక్‌తో చ‌ర్చ‌ల ప్ర‌స్తావ‌న ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు. న‌వాజ్ ష‌రీఫ్ పాక్ ప్ర‌ధాని కానున్నార‌ని, భారత్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని వారు చెబుతున్నార‌ని, చ‌ర్చ‌ల‌కు సిద్ధం కాక‌పోవ‌డానికి భార‌త్ చూపుతున్న కార‌ణాలేంట‌ని ఆయ‌న నిల‌దీశారు.