టీటిడిపి కి రాజీనామా చేసిన కాసాని

తెలంగాణ టీడీపీ పార్టీ కి మరో షాక్ తగిలింది. టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ కి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాసాని జ్ఞానేశ్వర్‌ గత సోమవారం చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో అభ్యర్థులు సొంత ఖర్చుతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయినా ఎందుకు వద్దంటున్నారో చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. లోకేశ్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదని … లోకేష్‌ దగ్గరకు వెళ్తే కనీసం మాట్లాడలేదని కాసాని వాపోయారు.

కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేయాలని ఓ వర్గం వాదన తెచ్చింది. ఈ మాత్రం దానికి నన్ను పార్టీలోకి ఎందుకు పిలిచారు, ఎందుకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని మొదట్లో టీడీపీ సిద్ధమైంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటన కూడా చేశారు. చంద్రబాబు జైలులో ఉండటంతో ఎన్నికల ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించారు. ఆయన వచ్చి ఇక్కడి నేతలతో సమావేశం నిర్వహించి, తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి అనుకున్న దశలో చంద్రబాబు ఇలా చెప్పడం బాధేసిందని కాసాని చెప్పుకొచ్చారు. మరి నెక్స్ట్ ఏంటి అనేది కాసాని పెండింగ్ లో పెట్టారు.