కర్ణాటక సీఎం పదవిపై సందిగ్ధత.. ఢిల్లీకి బయలుదేరిన సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటకలో నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నేత ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జనలు కొనసాగిస్తున్నది. ఇద్దరు సీనియర్ నేతలు సీఎం పదవికోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరు మాజీ సీఎం సిద్ధరామయ్య కాగా, మరో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.
ఇప్పటికే ఈ నేతలిద్దరూ తమ మద్దతుదారులతో సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ తనకు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి, లేదంటే వదిలేయండి అని చెప్పినట్టు సమాచారం. సీఎం పదవి కాకుండా క్యాబినెట్‌లో ఏ పదవీ తనకు వద్దని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం సిద్ధరామయ్య హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఇదిలావుంటే తాను ఢిల్లీకి వెళ్లనని, చెప్పాల్సింది ఇప్పటికే చెప్పానని, ఇక తనకు సీఎం పదవి ఇవ్వాలా.. వద్దా..? అనే నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని డీకే శివకుమార్ ప్రకటించారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో సీఎం పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.