కామారెడ్డి లో విషాదం : విద్యుత్ షాక్ తో నలుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం నెల‌కొంది. బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందారు. ఇంట్లో విద్యుత్​ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్‌ కాలనీలో నివాసం ఉండే హైమద్ కుటుంబ సభ్యులు ఈరోజు కరెంట్ షాక్ తో మరణించారు. ఇంట్లో మొద‌ట పిల్ల‌ల‌కు విద్యుత్ వైర్ త‌గిలింది. వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో త‌ల్లిదండ్రులిద్ద‌రూ క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. మృత‌దేహాల‌ను కామారెడ్డి ప్ర‌భుత్వ ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతులు హైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను సీఎం కేసీఆర్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి.. అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కామారెడ్డి ఆస్ప‌త్రి వ‌ద్ద మృతుల కుటుంబ స‌భ్యుల‌ను ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ ప‌రామ‌ర్శించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ ఘటన తో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడం తో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని , ముఖ్యంగా కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని , ఇంట్లో కూడా కరెంట్ వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.