తెలంగాణ లో ‘కంటి వెలుగు’ పథకం మళ్లీ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించేందకు కసరత్తు చేస్తోంది. రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే.. ఆ ప్రకటన మాత్రం నిర్దేశించిన ఐదు నెలల్లో పూర్తిగా అమలు కాలేకపోయింది. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇచ్చిన సర్కారు.. ఆపరేషన్లు మాత్రం పూర్తిగా నిర్వహించలేకపోయింది. అయితే.. ఇప్పటికే అమలవుతోన్న పలు పథకాలతో పాటు.. కంటి వెలుగు పథకాన్ని కూడా మరోమారు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. అన్నీ జిల్లాల అధికారులకు పథకం అమలుకు సంబంధించిన దిశానిర్దేశంతో పాటు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు కూడా సీఎం కేసీఆర్ ఇచ్చినట్టు సమాచారం.

ఇంతకు ముందు నిర్వహించినట్టుగానే ప్రతి జిల్లాలో క్యాంపులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతి క్యాంప్‌లో డాక్టర్‌తో పాటు నలుగురు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. స్థానిక ప్రాధమిక వైద్యశాల సిబ్బంది సమన్వయంతో కంటి పరీక్షలు, కళ్లద్దాలను అందజేయడంతో పాటు కంటి ఆపరేషన్‌లను కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైద్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.