రాష్ట్ర బిజెపి నేతలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయ‌కులఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తెలియదని బీజేపీ చెప్పింది. మరి, సంబంధం లేని కేసులో ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు? దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారు? దీని వెనక ఉన్నది బీజేపీనే. అందుకే సిట్‌ విచారణ ఆపాలని కోరుతున్నారు’అని హరీశ్‌రావు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో ప‌ట్ట‌ప‌గ‌లు దొరికిపోయ‌న‌టువంటి బీజేపీ దొంగల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌ల మారిపోయింది. గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రంటే భుజాలు త‌డుముకున్న‌ట్లుదని హరీష్ రావు అన్నారు.

ప్ర‌భుత్వం వారిని అరెస్టు చేసి, జైలుకు పంపిన త‌ర్వాత బీజేపీ నాయ‌కుల గొంతుల్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డంత ప‌నైంది. పార్టీ అధ్య‌క్షుడేమో త‌డి బ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం చేస్తాన‌ని అంటాడు. ఈ కేసును విచార‌ణ చేయొద్ద‌ని బీజేపీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంటాడు. ఈ కేసు విచార‌ణ ఆపండి. ఢిల్లీకి ఇవ్వండంటూ కోర్టుల్లో పిటిష‌న్ వేస్తాడు. త‌డిబ‌ట్ట‌లు, పొడిబ‌ట్ట‌లు, ప్ర‌మాణాలు అంటున్నారు. కేసు విచార‌ణ ఆపాల‌నేమో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోర్టుల్లో కేసులు వేస్తాడు. 8 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టి తెలంగాణ‌కు వ‌చ్చి, దొరికిపోయేస‌రికి కుడితిలో ప‌డ్డంత ప‌నైంది అని హ‌రీశ్‌రావు అన్నారు.