సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ,మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిజెపి పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించగా..తాజాగా సోమవారం బిఆర్ఎస్ అధిష్టానం 115 మందితో కూడిన మొదటి లిస్ట్ ను ప్రకటించింది. ఈ ప్రకటించిన లిస్ట్ లో కోరుట్ల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు బదులు తన తనయుడికి టికెట్ ఇవ్వడం పట్ల విద్యాసాగర్ రావు..కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

“నా అభ్యర్థనను మన్నించి నా కుమారుడికి కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో మా అబ్బాయిని గెలిపిస్తామని మీకు మాట ఇస్తున్నాను. మీకు మరోసారి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. కోరుట్ల నియోజకవర్గం కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కంచుకోట అని చెప్పాలి. ఆయన ఇక్కడ్నించి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.